అగ్ర నిర్మాతగా, పంపిణీదారుడిగా చెలామణి అవుతున్న నిర్మాత దిల్ రాజుకు 2018 కలిసిరాలేదు. 'లవర్', 'శ్రీనివాసకళ్యాణం' చిత్రాలు అతనికి భారీ నష్టాలను మిగిల్చాయి. 'హలో గురు ప్రేమ కోసమే' యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. భారీ విజయాలను చవిచూసే దిల్ రాజుకు ఘోర పరాజయాలు మింగుడుపడలేదు. ఓ రకంగా గత యేడాది దిల్ రాజుకు చుక్కలు కనిపించాయి. అయితే ఈ యేడాది ఆరంభమే దిల్ రాజు భారీ విజయాన్ని చవిచూసాడు.
వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'F2' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను కురిపిస్తూ విజయవంతంగా ముందుకుదూసుకెళుతోంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా విడుదలకు ముందు దిల్ రాజు ఎలాంటి హడావిడి చేయలేదు. ప్రమోషన్ పరంగా కూడా లో ఫ్రొపెయిల్ మెయింటెన్ చేసాడు. ఏదో ఒక విషయంలో నోరు పారేసుకుని వివాదంలో ఇరుక్కునే దిల్ రాజు, ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదు. కామ్ గా ఉంటూ, సినిమాపై అంచనాలను పెంచేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ అంశమే బాగా కలిసొచ్చిందని, 'F2' పెద్ద హిట్ అవ్వడానికి కారణాలయ్యాయని అంటున్నారు. ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉండటం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. సంక్రాంతి సినిమాల్లో చివరిగా విడుదలై యునానిమస్ హిట్ టాక్ తో దిల్ రాజుకు పోయిన వైభవాన్ని తెచ్చిపెట్టిది. సో... ఈ యేడాది దిల్ రాజుకు ఈ సినిమాతో శుభారంభం అయ్యిందని చెప్పొచ్చు.