ఈ నెల 20న ప్రారంభమైన 8వ కోల్ కత్తా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో ‘అప్పూ’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. “20వ తేదీ నుంచి 27 వరకూ ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవాల్లో 22న మా చిత్రం ప్రదర్శితం కానుంది. 2017లో హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన మా చిత్రం ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక కోల్ కత్తా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. 35 దేశాల నుంచి వచ్చిన చిత్రాల్లో ఎంపికైన 200పై చిలుకు చిత్రాల్లో మా “అప్పూ’ ఉండటం ఆనందంగా ఉంది’’ అని చిత్రదర్శకుడు కె. మోహన్ తెలిపారు. మాస్టర్ సాయి శ్రీవంత్ (యశస్వి) టైటిల్ రోల్ లో శ్రీమతి కె. లక్ష్మీ సమర్పణలో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది.
“అప్పూ” కథాంశం:
ఎనిమిదేళ్ల బాలుడు అప్పూకి ఏనుగుని చూడాలనే చిన్ని కోరిక ఉంటుంది. ఆ బాలుడి కోరిక తీర్చడానికి తల్లిదండ్రులకు తీరిక ఉండదు. ఎవరి వృత్తిలోవాళ్లు బిజీగా ఉంటారు. తన చిన్ని కోరికను తీర్చుకోవడానికి అప్పూ ఏం చేశాడు? తద్వారా తల్లిదండ్రులకు దూరమయ్యే అప్పూ క్షేమంగా ఇంటికిచేరుకుంటాడా? తన స్నేహితులతో కలిసి అప్పూ చేసిన సాహసం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'అప్పూ'. పిల్లల చిన్ని కోరికలను తీర్చకపోతే ఏం జరుగుతుంది? అనే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో మాస్టర్ సాయి శ్రీవంత్ నటించగా జాకీ, లోహిత్ కుమార్, ప్రగ్న,బిందు, బండ జ్యోతి, జె.వి.ఆర్, జ్వాలా చక్రవర్తి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.