ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది, రెగ్యులర్ షూటింగ్ ఎప్పట్నుంచి ఆరంభమవుతుందని సినీ ప్రియులు, అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూపులు చూసారు. ఆ శుభముహూర్తం రానే వచ్చేసింది. ఈ రోజు (13.4.2019) ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అల్లు అర్జున్ కాకుండా ముగ్గురు హీరోలు ఉన్నారు. ఆ ముగ్గురు హీరోలు ఎవరంటే...
కమెడీయన్ గా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకుని, ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టిన సునీల్ ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు, కామెడీ రోల్స్ చేస్తున్నాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్ ఓ మంచి పాత్ర చేయబోతున్నాడు. హీరోగా సినిమాలు చేస్తున్న నవదీప్ ఈ మధ్య వేరే హీరోల సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఈ సినిమాలో నవదీప్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఇక మూడో హీరో సుశాంత్. ఈ కుర్రహీరో ఇప్పటివరకూ సోలో హీరోగానే సినిమాలు చేసాడు. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు. అలా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో ముగ్గురు హీరోలు ఉండబోతున్నారు. వీరితో పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన టబు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, రాహుల్ రామకృష్ణతో పాటు రావు రమేష్, బ్రహ్మాజీ, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు చేయబోతున్నారు. మొత్తం మీద భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పొచ్చు.