సూపర్ స్టార్ మహేష్ బాబుతో డాషింగ్ అండ్ డైనమిక్ పూరి జగన్నాథ్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. 'జనగణమన' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని, భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అసలు మహేష్ బాబుతో పూరి ఈ సినిమా చేస్తారా లేదా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఆ వార్తలకు ఈ రోజు పూరి చెక్ పెట్టేసారు. ఈ సినిమాపై క్లారటీ ఇచ్చేసారు.
పూరి జగన్నాథ్ కచ్చితంగా 'జనగణమన' మూవీని చేస్తానని చెప్పారు. "జనగణమన అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అతి త్వరలో దాన్ని తియ్యడానికి ప్లాన్ చేస్తున్నా" అని ఆయన చేసిన ప్రకటనను పూరి కనెక్ట్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఎంతో కాలంగా 'జనగణమన' చిత్రాన్ని తీయాలని పూరి జగన్నాథ్ అనుకుంటూ వస్తున్నారు. అయితే ఇంతవరకూ అది వాస్తవ రూపం దాల్చకపోవడంతో, ఆ సినిమాని ఇక పూరి తీయరేమో అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతూ వస్తున్నాయి. వీటికి తాజా ప్రకటనతో పూరి జగన్నాథ్ చెక్ పెట్టారు.
'జనగణమన' పాన్ ఇండియా ఫిల్మ్‌గా తయారవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టోటల్ స్క్రిప్టును లాక్డౌన్ టైమ్‌లో ఆయన పూర్తి చేశారు. స్క్రిప్టు అద్భుతంగా వచ్చిందని సమాచారం.
'జనగణమన' మూవీని ఏ హీరోతో పూరి చేస్తారో త్వరలోనే వెల్లడి కానున్నది.
కాగా విజయ్ దేవరకొండ హీరోగా తను రూపొందిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఫైటర్' తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని పూరి జగన్నాథ్ చెప్పారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.