ప్రస్తుతం జనాలందరినీ బెంబేలెత్తిస్తున్నది కరోనా వైరస్. ఎదుటివారితో మాట్లాడాలంటే భయం. ప్రతివారిని అనుమానంగా చూడటం. మాస్క్ లు ధరించడం, చీటికిమాటికి శానిటైజర్స్ ని వాడటం మన జీవితంలో భాగమైపోయింది. ఓ రకంగా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. అన్ని పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవచ్చని గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడంతో టివి సీరియల్స్ షూటింగ్స్ ఆరంభమయ్యాయి. ఒకటి, రెండు సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే షూటింగ్స్ మొదలైన రెండు, మూడు రోజుల్లోనే రెండు టివి సీరియల్స్ కి సంబంధించిన నటులు, సాంకేతిక నిపుణులు కరోనా బారిన పడటంతో షూటింగ్ లను ఆపేసారు.తాజాగా సినిమా ఆఫీసుల్లో కూడా కరోనా కలకలం రేగుతోంది. ఓ ప్రముఖ నిర్మాత, డిస్ట్రబ్యూటర్ ఆఫీస్ లోని స్టాప్ కొంతమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. వారందరూ క్వారంటైన్ కి వెళ్లిపోయారు. సదురు నిర్మాత కూడా క్వారంటైన్ లోనే ఉన్నారట.
ఈ సంఘటన చాలా సినిమా ఆఫీసులపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న సినిమా ఆఫీసులను మళ్లీ మూసుకునేలా చేసింది. జూలై లేదా ఆగస్ట్ లో షూటింగ్ లు మొదలుపెడదాం, అంతవరకూ కామ్ గా ఇళ్లలో ఉందాం అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట.
సో... ఇంకా కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు స్థంభించిపోయినట్టేనని చెప్పొచ్చు.