సంక్రాంతి పండగ టాలీవుడ్ కి ఎంత ఇంపార్టెంట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 3, 4 పెద్ద సినిమాలతో పాటు, రెండు, మూడు చిన్న సినిమాలు విడుదలవుతాయి. భారీ ఓపెనింగ్స్ తో భారీ వసూళ్లు కురిపిస్తూ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. చిన్న సినిమాలు సైతం మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. జనవరి మొదటి వారం నుంచి మొదలయ్యే సందడి మూడో వారం వరకూ ఉంటుంది.
అయితే 2021 సంక్రాంతి పండగకు ఎన్ని సినిమాలు విడుదలవుతాయనే విషయంలో ఇప్పటివరకూ క్లారటీ లేదు. కరోనా రాకముందు అయితే భారీ బడ్జెట్ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్', నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి #BB3, మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'ఆచార్య' సినిమాలు 2021 సంక్రాంతి రేసులో ఉంటాయని అందరూ భావించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. థియేటర్స్ బంద్ అయిపోయాయి. ఇంకా షూటింగ్ లు ఆరంభమవ్వలేదు. ఎప్పుడు ఆరంభమవుతాయో తెలీడంలేదు. కాగా తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ వరకూ షూటింగ్ చేయడానికి చిరు, బాలయ్య ఇష్టపడటంలేదట. ఈ నేపధ్యంలో వీరి సినిమాలు వచ్చే యేడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశంలేదు. కాబట్టి 2021 సంక్రాంతి రేసులో చిరు, బాలయ్య లేనట్టే.
అయితే ఇదే యేడాది విడుదల చేయాలనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా సంక్రాంతి రేసులో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 30 శాతం మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. అందుకే సెప్టెంబర్, అక్టోబర్ లో షూటింగ్ చేసి, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
సో... సంక్రాంతి రేసు నుంచి అన్నయ్య చిరు తప్పుకుంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' తో రంగంలోకి దిగబోతున్నాడని చెప్పొచ్చు.