దండయాత్ర ..! ఇది దయాగాడి దండయాత్ర!! అంటూ పవర్‌ప్యాక్డ్ డైలాగ్‌తో అభిమానుల్లో డిస్కషన్ పాయింట్ అయ్యాడు ఎన్టీఆర్. ఆ ఒక్క డైలాగ్‌తో మరోసారి ఫ్యాన్స్‌లో హుషారు పెంచాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'టెంపర్'తో మరోసారి మాస్‌లో తన స్టామినా ఎలాంటిదో చూపించాడు ఎన్టీఆర్. ఈ ఏడాది (2015) ఆరంభమే 'టెంపర్' తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని బాస్ ఆఫ్ మాసెస్ అని ప్రూవ్ చేశాడు. తనలోని అసలు సిసలు మాసిజం ఎలా ఉంటుందో 'ఆది', 'సింహాద్రి', 'టెంపర్' వంటి చిత్రాల్లో చూపించాడు ఎన్టీఆర్. రామయ్యా వస్తావయ్యా, రభస లాంటి ఫ్లాప్ సినిమాల తర్వాత కెరీర్‌కి కీలకమైన హిట్ 'టెంపర్'. ఎన్టీఆర్ స్టామినాను మరోసారి ప్రపంచానికి ఆవిష్కరించింది ఈ చిత్రం. అయితే ఇలాంటి హిట్లు, బ్లాక్‌బస్టర్లు, అపజయాలు అతడికి కొత్తేమీ కాదు.
ఎన్టీఆర్ కెరీర్‌ని ఓసారి తరచి చూస్తే .. అతడు నటించిన రెండో సినిమానే ఇండస్ర్టీలో సూపర్‌హిట్. 'నిన్ను చూడాలని' (2001) సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి రెండో ప్రయత్నమే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'స్టూడెంట్ నంబర్ 1' (2001)లో నటించి సూపర్‌హిట్ కొట్టాడు. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఆది' సినిమాతో బాక్సాఫీస్‌ని రికార్డులతో షేకాడించాడు. మాస్‌లో ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఓ రెండు పరాజయాలు కెరీర్‌ని ఇబ్బందిపెట్టినా, మరోసారి తనకి తొలి విజయాన్ని ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలోనే 'సింహాద్రి' వంటి ఇండస్ర్టీ హిట్‌తో ట్రాక్‌లోకి వచ్చాడు. 2003లో రిలీజైన 'సింహాద్రి' బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మాస్‌లో మాసివ్ హిట్ ఇది. ఆ క్రమంలోనే కమర్షియల్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో నటించిన 'ఆంధ్రావాలా' కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అలాంటి టైమ్‌లో తనకి అలవాటైన దర్శకుడు వినాయక్ సారథ్యంలో 'సాంబ' చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 'నరసింహా', 'అశోక్' వంటి ఫ్లాప్స్ తర్వాత 'రాఖీ' వంటి యావరేజ్ సినిమా చేశాడు. ఆ తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళితోనే ముచ్చటగా మూడో సినిమాలో నటించాడు. ఫాంటసీ, యమలోకం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన 'యమదొంగ' కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'కంత్రి'తో మరో పరాజయం. ఆ వెనువెంటనే తను నమ్మే స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో 'అదుర్స్' చిత్రంలో నటించి కెరీర్‌లో కీలకమైన టైమ్‌లో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించి ఎన్టీఆర్ మ్యాజిక్ చేశాడు. ఆ వెంటనే దిల్‌రాజు సంస్థానంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'బృందావనం'తో మరో క్లాసిక్ హిట్ కొట్టాడు. కెరీర్ పీక్స్‌లో మరోసారి కుదుపు. వరుసగా 'శక్తి', 'ఊసరవెల్లి', 'దమ్ము' వంటి పరాజయాలు ఎన్టీఆర్‌ని పూర్తిగా బ్యాక్ ఫుట్ వేసేలా చేశాయి. ఈ పరాజయాల నుంచి తనని తాను బైటపడేసే దర్శకుడి కోసం ఎంతో వేచి చూశాడు తారక్. ఆ టైమ్‌లోనే శ్రీనువైట్ల 'బాద్‌షా' రూపంలో ఓ హిట్ ఇచ్చాడు. ఇక కుదురుకున్నట్టే అనుకుంటున్న టైమ్‌లో వరుసగా 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' ఫ్లాప్‌లు చిక్కుల్లోకి నెట్టాయి. సరిగ్గా అలాంటి టైమ్‌లో 'టెంపర్' విజయం తనకి పెద్ద అస్సెట్‌గా నిలిచింది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమ'తో చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో రివెంజ్ డ్రామా. తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
బాలనటుడిగా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' (1991) చిత్రంలో తాత ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. ఆ తర్వాత 1996లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'బాల రామాయణం' చిత్రంలో రాముడిగా నటించి బాలనటుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పటికి 25 చిత్రాల్లో నటించాడు. ఇన్నేళ్లలో మాస్‌లో బాస్‌గా ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం అసాధారణమైనది. నందమూరి వంశం నుంచి నటసింహం బాలయ్యబాబు తర్వాత ఆ స్థాయిలో ఎన్టీఆర్‌కి మాత్రమే క్రేజు ఉందన్నది సత్యం. ఎన్టీఆర్ ఓ స్టార్‌గానే కాదు, ఓ గొప్ప మానవతావాదిగానూ పేరు తెచ్చుకున్నాడు. తనని నమ్మే దర్శకులంటే ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తాడు. ఫ్లాప్ దర్శకుడు అన్న ముద్ర వేసి స్నేహాన్ని వదిలేయని గొప్ప వ్యక్తిత్వం ఎన్టీఆర్‌ది. తనకి 'కంత్రి' వంటి ఫ్లాప్‌నిచ్చిన మెహర్‌తోనే 'శక్తి' సినిమా చేశాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆప్తుడిగానూ అభిమానులు చెబుతుంటారు. కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిలింఫేర్‌లను నాలుగు సార్లు అందుకున్నాడు. 'స్టూడెంట్ నంబర్ 1' చిత్రంతో నంది జ్యూరీ అవార్డును కైవశం చేసుకున్నాడు. పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాగ్నెట్, ల్యాండ్ లార్డ్ నార్నే శ్రీనివాసరావు తనయురాలు లక్ష్మి ప్రణతిని మనువాడి ఓ బిడ్డ (అభయ్‌రామ్)కు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని 50 కోట్ల క్లబ్ నుంచి 100 కో్ట్ల క్లబ్ స్థాయి హీరోగా ఎదగడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. ఓవర్సీస్‌లోనూ, పొరుగు భాషల్లోనూ మార్కెట్ రేంజుని విస్తరించాలన్న సంకల్పంతో ఉన్నాడు. ఆ లక్ష్యం 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో అందుకోవాలని కోరుకుందాం. ఎన్టీఆర్‌కి ఆల్ ది బెస్ట్.