ఓ స్టార్ హీరో నటవారసుడు సినిమాల్లో అడుగుపెడితే ఏర్పడే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకుని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనిపించుకున్న నందమూరి తారకరామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ తెరంగేట్రం అప్పట్లో ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో భారీ అంచనాలు ఏర్పర్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు.
తాతమ్మ కలతో బాలనటుడిగా...
1974లో 14 ఏళ్ళ వయసులోనే బాలనటుడిగా 'తాతమ్మ కల' చిత్రంతో తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తరువాత 'రామ్ రహీం', ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రాల్లో నటించి, తన నటవారసత్వాన్ని కొనసాగించారు. తన తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు బాలకృష్ణ. ముఖ్యంగా 'శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి' చరిత్రలో పోషించిన సిద్ధయ్య పాత్ర బాలకృష్ణలో ఎంత మంచి నటుడు ఉన్నాడో నిరూపించింది.
సాహసమే జీవితం...
'సాహసమే జీవితం' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారారు బాలకృష్ణ. పౌరణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటిస్తూ, ఎన్టీఆర్ కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మంగమ్మగారి మనవడు, కథానాయకుడు, బాబాయ్ అబ్బాయి, భలే తమ్ముడు, సీతారామ కళ్యాణం, అనుసూయమ్మగారి అల్లుడు బాలకృష్ణను స్టార్ హీరోగా నిలిపాయి. ఇక, 'ఆదిత్య 369' లాంటి సోషియో ఫాంటసీ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయి. ఆ చిత్రం తరువాత వచ్చిన జానపద చిత్రం 'భైరవద్వీపం' సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
ట్రెండ్ సెట్టర్..
'సమరసింహారెడ్డి' అయితే 1990లలో ఓ ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన 'నరసింహ నాయుడు' అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది. తర్వాత లక్ష్మీనరసింహా, సింహా, లెజెండ్, లయన్, డిక్టేటర్ చిత్రాల్లో నటునిగా బాలయ్య ఏ స్థాయిలో విజృంభించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'శ్రీరామరాజ్యం'లో రామునిగా బాలయ్య ఒదిగిపోయిన వైనం చూసినవాళ్లు, నేటి తరంలో పౌరాణిక పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడు బాలయ్యే అని ప్రశంసించారు.అవును.. ఈ తరంలో పౌరాణిక పాత్రలు చేయడం బాలయ్యకే సాధ్యం అంటే అతిశయోక్తి కాదు. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ, 40ఏళ్లుగా నిరవధికంగా సినిమాలు చేస్తున్న బాలయ్య వంద చిత్రాలకు చేరవయ్యారు. ఈ నలభై యేళ్లల్లో చిన్న గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసిన ఘనత బాలయ్యది. ఇలాంటి రికార్డ్ ఏ కొంతమంది నటులకో మాత్రమే దక్కుతుంది.
గౌతమిపుత్ర శాతకర్ణి...
ప్రస్తుతం బాలయ్య వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి భారీ స్పందన లభించింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. నటుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాలయ్య బిజీ బిజీగా కొనసాగుతున్నారు.
పరిపూర్ణమైన ఆనందంలో...
వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బాలయ్య పరిపూర్ణ ఆనందంలో ఉన్నారు. నటుడిగా వరుస విజయాలతో దూసుకెళుతున్నారాయన. ప్రస్తుతం బాలకృష్ణ ముందున్నది రెండే లక్ష్యాలు. ఒకటి సినిమాలు.. రెండోది ప్రజాసేవ. హిందూపురాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే బాలయ్య పలు ప్రణాళికలు వేశారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడటంలేదు. ఈ నందమూరి అందగాడి పుట్టినరోజు నేడు (జూన్, 10).
ఈ సందర్భంగా 'పిల్మీబజ్.కామ్' బృందం బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.