తెలుగు చలన చిత్రసీమలో సంచలనానికి మారుపేరు అనిపించుకుని, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు మహానటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఆయన శ్రీకృష్ణుడి పాత్ర చేస్తే ఆ కృష్ణుడు ఇలానే ఉంటాడేమో.. రావణుడు పాత్ర చేస్తే ఆ అసుర మహరాజు ఇలానే ఉంటాడేమో.. అనిపించే స్థాయిలో ఎన్టీఆర్ ఒదిగిపోయేవారు. ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దుష్టపాత్రలుగా పరిగణించే వాటిలోంచి కూడా మంచిని పిండి చూపించడం ఎన్టీఆర్ కి కొట్టినపిండి. 'దాన వీర శూర కర్ణ'లో కులవ్యవస్థను చీల్చి చెండాడుతూ దుర్యోధనుణ్ణి సుయోధనుడిగా సాక్షాత్కరింపజేసిన తీరు న భూతో న భవిష్యతి. వివిధ చిత్రాల్లో కర్ణుడిగా, కీచకుడిగా కూడా తనదైన తీరులో నటించి, ప్రేక్షకులను అలరించారు. శ్రీరామచంద్రుడిగా ప్రేక్షకల మనస్సుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఎన్టీఆర్ అంతకు ముందే 'భూకైలాస్'లో రావణుడి పాత్రను అద్భుతంగా పోషించడం విశేషం. 'శ్రీరామపట్టాభిషేకం'లో అటు రాముడి పాత్రను ఇటు రావణుడి పాత్రను కూడా తానే పోషించి, శభాష్ అనిపించుకున్నారాయన.
కళారంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ ఎదురు లేని మనిషిగా, తిరుగులేని మనిషిగా ఆయన విరాజిల్లిన వైనం న భూతో న భవిష్యతి. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే పదవిని అలంకరించిన ధీశాలి అన్నగారు. కిలో బియ్యం రెండు రూపాయలకే అనే పధకంతో పేదవాడి కడుపు నింపిన మహనీయుడు. అందుకే 'ఏం చేసినా అది ఎన్టీఆర్ కే చెల్లింది' అనడం అతిశయోక్తి కాదు. యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ మహా మనిషి. తెలుగు ప్రజల గుండెల్లో 'అన్నగారు'గా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వర్ధంతి నేడు (18.1.2016.). ఈ సందర్భంగా ఆయనను తలచుకుంటూ ఈ కథనం. అన్నగారు అమరజీవి.