50కోట్ల క్లబ్ లో ఓ సినిమా చేరడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఓ రికార్డ్ అనేంతగా టాలీవుడ్ పరిస్థితి ఉండేది. అలా 50కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం తదుపరి చిత్రాలకు పెద్ద సవాల్ అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా సునాయాసంగా తెలుగు సినిమా 50కోట్ల వసూళ్లను సాధించేస్తోంది. ఇక 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాల విడుదల తర్వాత తెలుగు సినిమా టార్గెట్ 75 నుంచి 100కోట్లు అయిపోయింది. ప్రస్తుతం సమ్మర్ లో విడుదలకాబోతున్న పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం', ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రాలపైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమాల్లో ఏ సినిమా 100కోట్ల క్లబ్ లో చేరి ఏ హీరో 100కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా తొలి రికార్డును కైవసం చేసుకుంటాడనే లెక్కలు, బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి.
సర్దార్ గబ్బర్ సింగ్
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం భారీ బిజినెస్ చేసింది. ఈరోస్ ఇంటర్నేనల్, ఐ డ్రీమ్ సంస్ధలు కలిసి ఈ చిత్రం శాటిలైట్, థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ హక్కులను 85కోట్లుకు దక్కించుకుందట. ఎక్కువ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ సినిమాలు భారీ ఓపినింగ్స్ సాధిస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కలను బట్టి ఈ సినిమా 100కోట్ల క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బ్రహ్మోత్సవం
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం బిజినెస్ భారీగా జరిగిందనే వార్తలు ఉన్నాయి. ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ కే 13కోట్లు దక్కాయట. మిగతా ఏరియాలు కూడా ఫుల్ స్వింగ్ లో బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో మహేష్ బాబు 100కోట్ల క్లబ్ లో చేరిపోతాడని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తోంటే, అభిమానులైతే 100కోట్ల క్లబ్ లో చేరి తొలి రికార్డును కైవసం చేసుకోబోయేది మహేష్ బాబే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
జనతా గ్యారేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న 'జనతా గ్యారేజ్' చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వలేదు. ఈలోపే ఆంధ్ర, నైజాం, సీడెడ్, కర్నాటక, ఓవర్ సీస్, తమిళ్ డబ్బింగ్ రైట్స్ కలిపి 65కోట్లుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలుపుకుంటే 80కోట్లుదాకా బిజినెస్ జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 50కోట్ల క్లబ్ లో చేరని ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఆ క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు 'జనతా గ్యారేజ్' చిత్రం చేసిన బిజినెస్ తో 100కోట్ల క్లబ్ లో చేరిపోతాడని పరిశీలకులు అంటున్నారు.
సరైనోడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'సరైనోడు' చిత్రం కూడా సమ్మర్ కానుకగానే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, ఓవర్ సీస్, శాటిలైట్, కేరళ, కర్నాటక, తమిళనాడు, హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తం కలిపి 70కోట్లుదాకా దక్కించుకునే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు. ఇంతకుమించే బిజినెస్ జరిగే అవకాశముందిగానీ, తగ్గే అవకాశంలేదంటున్నారు. పైగా ఎక్కువ థియేటర్స్ లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంతో 60కోట్ల క్లబ్ లో చేరిపోయాడు అల్లు అర్జున్. ఇక 'సరైనోడు'తో 100కోట్ల క్లబ్ లో చేరడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడున్న మార్కెట్ రేంజ్, పెరిగిన తెలుగు సినిమా స్థాయిని బట్టి 100కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేంకాదని పరిశీలకులు అంటున్నారు.
సో... సమ్మర్ బరిలోకి దిగుతున్న ఈ హీరోల్లో ఎవరు 100కోట్ల క్లబ్ లో చేరి తొలి రికార్డును కైవసం చేసుకుంటారో వేచి చూద్దాం.