చిత్రం - భగత్ సింగ్ నగర్
నటీనటులు - విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ - రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
ఎడిటింగ్ - జియాన్ శ్రీకాంత్
నిర్మాతలు - వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం - వాలాజా క్రాంతి
భగత్ సింగ్ నగర్ - ఈ టైటిల్ స్ఫూర్తిదాయకం. ఇలాంటి టైటిల్ తో వస్తున్న సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ఈ రోజు (26.11.2021) ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... టైటిల్ కి తగ్గట్టే సినిమా కూడా అందరూ మెచ్చే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
భగత్ సింగ్ నగర్ ఒక మురికివాడ. ఈ మురికివాడకు చెందిన శ్రీను (విదార్థ్) అక్కడున్న తన స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. వీరి గ్యాంగ్ లో చంద్రయ్య (ముని చంద్ర) అనే తాత కూడా ఉంటాడు. ఆ తాత ఇంట్లో లక్ష్మి (దృవీక) అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయిని శ్రీను ఇష్టపడతాడు. లక్ష్మి కూడా శ్రీనును ఇష్టపడుతుంది. ఉదయం అంతా పనిచేసి, సాయంత్రం అయ్యేసరికి శ్రీను తన స్పేహితులతో కలిసి మద్యం తాగుతుంటాడు. కానీ తమ భగత్ సింగ్ నగర్ లో మద్యపానానికి అలవాటు పడి కుటుంబాలు నాశనం అవుతున్న విషయాన్ని అర్ధం చేసుకుని మద్యం తాగడం మానేస్తాడు శ్రీను. అలాగే ఎక్కడ గొడవలు జరిగినా వాటిని ఆపేందుకు తన ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో భగత్ నగర్ సింగ్ కి చెందిన కొంతమంది అమ్మాయిలు కిడ్నాప్ కు గురవుతారు. ఈ కిడ్నాప్ ల గురించి చంద్రయ్యకు తెలుసు. కానీ ఎవ్వరికీ చెప్పడు. మరోవైపు శ్రీను, లక్ష్మి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. సరిగ్గా అదే సమయంలో లక్ష్మిపై కొందరు హత్యాచారం చేస్తారు. అడ్డుకున్నశ్రీను ను కూడా చంపేస్తారు. నేరస్థులతో చేతులు కలిపిన పోలీసులు ఈ కేసును క్లోజ్ చేస్తారు. ఇదే కేసుపై భగత్ అనే కుర్రాడు పోరాటం మొదలుపెడతాడు. ఈ పోరాటంలో భగత్ కి న్యాయం జరుగుతుందా... కిడ్నాప్ కి గురైన అమ్మాయిల కథ ఏంటీ... ఇందులో ఎమ్మెల్యే వైసీరావు (అజయ్ ఘోష్) కి సంబంధం ఏంటీ, శ్రీను, లక్ష్మి ల హంతకులకు శిక్షపడిందా, భగత్ పోరాటానికి అనన్య ఎలా సహాయపడింది తదితర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
నటీనటుల పెర్ ఫామెన్స్
శ్రీను, భగత్ రెండు క్యారెక్టర్స్ ను పోషించిన విదార్థ్ చాలా చక్కగా పెర్ ఫామ్ నటించాడు. ముఖ్యంగా స్లమ్ బాయ్ శ్రీనుగా తన బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునే విధంగా ఉంది. డాక్యుమెంటరీ మేకర్, సిటీ కుర్రాడు భగత్ గా కూడా విదార్థ్ చక్కటి నటన కనబర్చాడు. లక్ష్మి, అనన్య పాత్రల్లో దృవీక కు రెండు షేడ్స్ లో కనిపించే అవకాశం దక్కింది. ట్రెడిషనల్ గర్ల్ గా, మోడ్రన్ అమ్మాయిగా దృవీక మెప్పించింది. ఎమ్మెల్యే గా అజయ్ ఘోష్, కథలో ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్ లో రవి కాలె తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. విజువల్ గా సినిమా బాగుంది. 'చరిత చూపని...' సాంగ్ సూపర్బ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ఎలివేట్ చేసే విధంగా ఉంది. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ ని సమకూర్చారు. డైరెక్టర్ వాలాజ క్రాంతి మంచి స్టోరీ లైన్ ఎంచుకోవడంతో పాటు, చక్కటి స్ర్కీన్ ప్లే సమకూర్చుకుని ఆసక్తిగా సినిమాని తెరకెక్కించారు.
విశ్లేషణ
ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటే, ఆ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుంది. 'భగత్ సింగ్ నగర్' లో కమర్షియల్ అంశాలతో పాటు మంచి మేసేజ్ కూడా ఉంది. అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, తిరగబడాలి అనే స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్న సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే, సొసైటీలో జరిగే అన్యాయాలకు అడ్డుకట్ట వేయగలుగుతామనే ఆలోచన రేకెత్తించడంలో డైరెక్టర్ వాలాజ క్రాంతి పూర్తిగా సక్సెస్ అయ్యారు. సరదాగా మందు కొడుతూ తిరిగే కుర్రాడు, మద్యం అలవాటు కుటుంబాలను నాశనం చేస్తుందని గ్రహించి మద్యం మానేయడం స్ఫూర్తిదాయకంగా ఉంది. భగత్ సింగ్ నగర్ లో ఎవరూ మహిళలను కించపరిచినా, వారికి బుద్ది చెప్పే సీన్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ సీన్స్ లో హీరోగా నటించిన విదార్థ్ కూడా చాలా చక్కగా నటించాడు. భగత్ గా న్యాయం కోసం పోరాడే కుర్రాడిగా కూడా విదార్థ్ నటన వావ్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగతీసిన విధానం మాత్రం ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. అలాంటి సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటే, సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. రీరికార్డింగ్ విషయంలో కూడా ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ మరింతగా ఆడియన్స్ మనసుల్లోకి చొచ్చుకునిపోయేవి.
ఓవరాల్ గా చెప్పాలంటే - కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మంచి మెసేజ్ ఉంది. సో... డోంట్ మిస్ ది మూవీ. వాట్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5