చిత్రం - జై సింహా
బ్యానర్ - సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, బ్రహ్మానందం, ప్రియ తదితరులు
సంగీతం - చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ - రాంప్రసాద్
కథ, మాటలు - యం.రత్నం
నిర్మాత - సి.కళ్యాణ్
దర్శకత్వం - కె.యస్.రవికుమార్
సంక్రాంతి బరిలో నందమూరి నటిసింహం బాలకృష్ణ దిగితే, ఆ బొమ్మ హిట్టే... రికార్డులు మోత మోగడం ఖాయం... సంక్రాంతి రారాజు బాలయ్య అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. గత యేడాది 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' తో సంక్రాంతి పండగకు బరిలోకి దిగి విజయం సాధించిన బాలయ్య ఈ యేడాది 'జై సింహా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలుగా నటించారు. చిరంతన్ భట్ సంగీతమందించారు. సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మించిన 'జై సింహా' మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టే విధంగా ఉందా తెలుసుకుందాం.
కథ
యేడాది వయసున్న కొడుకుతో నరసింహ (బాలకృష్ణ) పలు చోట్ల రకరకాల పనులు చేసి, అక్కడ తన కొడుకు ఇబ్బంది పడుతున్నాడనే కారణంతో ఫైనల్ గా కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఆలయ ధర్మకర్త మురళీకృష్ణ (మురళీమోహన్) గారి ఇంట్లో డ్రైవర్ గా చేరతాడు. కుంభకోణంలోని లోకల్ రౌడీ కనియప్పన్ (కాళకేయ ప్రభాకర్), ఎ.సి.పి తో గొడవలు జరుగుతాయి. ఈ ఇద్దరూ నరసింహ మీద పగ తీర్చుకోవడానికి ఎదురుచూస్తుంటారు. ఓ సిట్యువేషన్ లో నరసింహ కొడుకును కిడ్నాప్ చేస్తాడు కనియప్పన్. ఆ బాబుని కాపాడతాడు నరసింహ. ఆ బాబు ఎ.సి.పి బాబులానే ఉంటాడు. దాంతో తన కొడుకును కాపాడినందుకు ఎ.సి.పి నరసింహకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఎ.సి.పి భార్య గౌరి (నయనతార) జయసింహను చూసి షాక్ అవుతుంది. తనకెప్పటికీ ఎదురుపడవద్దని నరసింహ దగ్గర చెప్పి అతనంటే ఎంత అసహ్యమో చెబుతుంది. ఈ సిట్యువేషన్ ని జైల్లో ఉన్న అశుతోష్ రాణా టివిలో చూసి, నరసింహను చంపిన తర్వాతే తనకు ఉరి శిక్ష అమలవ్వాలని భావించి జైల్లోనే తన భార్య వసంతను చంపేస్తాడు.
అసలు ఎ.సి.పి కొడుకు నరసింహ కొడుకులానే ఎందుకున్నాడు... నరసింహ అంటే గౌరికి ఎందుకంత కోపం... జైల్లో ఉన్న అశోతోష్ రాణా కి నరసింహపై ఎందుకంత పగ... నరసింహ భార్య ఎవరు తదితర ట్విస్ట్ లతో ఈ చిత్రం సెకండాఫ్ సాగుతుంది.
నటీనటుల పెర్ ఫామెన్స్
బాలయ్య ఇమేజ్ కి తగ్గ పాత్ర నరసింహ. ఈ పాత్రలో తనదైన శైలిలో రెచ్చిపోయాడు బాలకృష్ణ. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ తో అబిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ముఖ్యంగా 'అమ్మకుట్టి...' పాటకు బాలయ్య వేసిన స్టెప్పులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. సెంటిమెంట్ సీన్స్ తో కట్టిపడేసాడు. నయనతార నటన సూపర్బ్. క్లయిమ్యాక్స్ లో నయనతార నటనకు పిధా అయిపోతారు. హరిప్రియ, నటాషా తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. తండ్రిగా, మాస్టర్ గా అద్భుతమైన పాత్రను చేసాడు. బ్రహ్మానందం కొన్ని సీన్స్ లో నవ్వించాడు. విలన్స్ గా కాళకేయ ప్రభాకర్, ఆశుతోష్ రాణా బాగున్నారు. చక్కగా నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' కి సంగీతమందించి శభాష్ అనిపించుకున్నాడు సంగీత దర్శకుడు చిరంతన్ భట్. ఇప్పుడు బాలయ్య కమర్షియల్ ఎంటర్ టైనర్ 'జై సింహా' కి చక్కటి పాటలిచ్చి మరోసారి వావ్ అనిపించుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. రాంప్రసాద్ కెమెరా సినిమాకి హైలైట్. ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ యం.రత్నం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ ని, బాలయ్య తనదైన శైలిలో చెబుతోంటే ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు. పంచ్ డైలాగులు పేలాయి. కె.యస్.రవికుమార్ టేకింగ్ లో స్టైలిష్ నెస్ లోపించింది. కొత్త టెక్నిక్స్ తో సినిమాని చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పటి దర్శకులు. కానీ రవికుమార్ మాత్రం ఓల్డ్ టెక్నక్స్ నే వాడటం నిరాశపరుస్తుంది. నిర్మాణపు విలువలు సూపర్బ్.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, సెంటిమెంట్, లవ్... ఇలా అన్ని మసాలాలు దట్టించి పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం 'జై సింహా'. బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో, వాటిపై దృష్టి పెట్టి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేయడానికి డైరెక్టర్ రవికుమార్ శాయశక్తులా కృషి చేసారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. పంచ్ డైలాగులు మిస్ అవ్వలేదు. బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి, పౌరోహిత్యము గొప్పదనం గురించి చెప్పిన డైలాగులకు బాలయ్య అభిమానులే కాదు... సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. చప్పట్లు కొడుతున్నారు. ఇంటర్వెల్ సీన్, క్లయిమ్యాక్స్ సీన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. రొటీన్ స్టోరీ అయినప్పటికీ, ట్విస్ట్ లతో సాగిన స్ర్కీన్ ప్లే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఫస్టాప్ కామెడీ సీన్స్, కొన్ని ట్విస్ట్ లు, ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ తో సెకండాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది. సెకండాఫ్ లో కూడా మంచి ట్విస్ట్ లు, నయనతారతో లవ్ సీన్స్, క్లయిమ్యాక్స్ బాగుంటాయి. కానీ సెకండాఫ్ నిడివి కాస్త తగ్గి, అనవరసమైన సీన్స్ కి కత్తెర వేసి ఉంటే, సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. ఏదేమైనా బాలయ్య నటన, డ్యాన్స్, డైలాగులు నందమూరి అభిమానుల్లో పెట్టింపు ఉత్సాహాన్ని నింపుతాయి. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పండగకు సరైన ట్రీట్ అనిపించేలా 'జై సింహా' ఉంది, సంక్రాంతి రారాజు బాలయ్య అని మరోసారి ఈ సినిమా నిరూపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్, బి.సి సెంటర్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... సంక్రాంతికి జై సింహా జైత్రయాత్ర షురూ అయ్యింది.. డోంట్ మిస్ ఇట్...!
ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3.5/5