చిత్రం : రాయలసీమ లవ్ స్టోరీ
నటీనటులు : వెంకట్, హ్రిశాలి, పావని, తిల్లు వేణు, నాగినీడు తదితరులు
సంగీతం : శ్రీ సాయి ఏలేందర్
సినిమాటోగ్రఫీ : రామ్ మహేందర్
ఎడిటర్ : వినోద్ అద్వే
దర్శకత్వం : రామ్ రణధీర్
నిర్మాతలు : రాయల్ చిన్నా, నాగరాజు
A 1 ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ హీరోగా హృశాలి, పావని హీరోయిన్స్ గా నటించిన చిత్రం రాయలసీమ లవ్ స్టోరీ. రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు (27.9.2019) ఘనంగా విడుదలయ్యింది. టైటిల్ పట్ల అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అయినా సరే అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా సినీప్రియులను ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
కథ
రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కృష్ణ (వెంకట్). ఎస్.ఐ ట్రైనింగ్ నిమిత్తం కృష్ణ హైదరాబాద్ వస్తాడు. తన ఫ్రెండ్ శృంగారం (నల్ల వేణు) తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. ఇంటికి అద్దె కట్టని కారణంగా ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో డాక్టర్ పల్లవి వీరికి ఆశ్రయమిస్తుంది. తన ఇంట్లో వీరు ఉండేలా ఏర్పాట్లు చేస్తుంది. పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ (హృశాలి) ప్రేమలో పడతాడు కృష్ణ. రాధ కూడా కృష్ణను ప్రేమిస్తుంది. అయితే రాధ పెళ్లి మరొకరితో నిశ్చయించబడుతుంది. దాంతో పద్మ వల్ల మోసపోయినట్టే, రాధ వల్ల కూడా మోసపోయానని కృష్ణ కుమిలిపోతాడు. అసలు ఈ పద్మ ఎవరు... కృష్ణ ఎలా మోసపోయాడు... రాధ, కృష్ణ ఒకటవుతారా... ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
కృష్ణగా నటించిన వెంకట్ కి ఇది ఫస్ట్ మూవీ. హీరో పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఓ ఎక్స్ పీరియన్స్ నటుడిలా పర్ ఫామ్ చేసాడు. ఎమోషన్స్, లవ్, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన శైలిలో నటించడంతో అతనికి ఆడియన్స్ ప్రశంసలు దక్కుతాయి. హీరోయిన్ లుగా నటించిన పావని, హృశాలి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. పావని నటనతో ఆకట్టుకుంటే హృశాలి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయింది. సపోర్టివ్ పాత్రల్లో నటించిన 30 ఇయర్స్ పృథ్వి, మిర్చి మాధవి, నల్లవేణు, జబర్దస్త్ బ్యాచ్ కొమరం, గెటప్ శ్రీను, రాజమౌళి, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
రామ్ రణధీర్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ తడబాటు లేకుండా సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. స్ర్కీన్ ప్లే బాగుంది. దర్శకుడిగా కొత్త అయినప్పటికీ తనకు కావాల్సిన నటనని నటీనటుల నుండి రాబట్టుకున్నాడు. డైలాగ్స్ పరంగా కాస్త పరిధి దాటినప్పటి కుర్రకారును అలరించేలా ఉన్నాయి. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా నువ్వంటే పిచ్చిపిచ్చి... ముద్దు తొలి ముద్దు అనే పాటలు హైలెట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని హైలైట్ చేసే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు రాజీపడకుంగా, కథకు కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చారు.
విశ్లేషణ
యూత్ ని మెప్పించే అన్ని అంశాలను ఈ సినిమాలో పొందుపరచడం సినిమాకి ప్లస్ అయ్యింది. లిప్ లాక్ సీన్స్, వెంకట్ నటన, హృశాలి గ్లామర్, ఎంటర్ టైన్ మెంట్, పాటలు యూత్ ని కట్టిపడేస్తాయి. అన్ని మసాలాలు దట్టించి, ఓ మంచి మేసేజ్ కూడా ఇవ్వడంతో డైరెక్టర్ కి ప్లస్ పాయింట్స్ పడతాయి.
ఫైనల్ గా చెప్పాలంటే...రాయలసీమ లవ్ స్టోరీ యూత్ ని ఆకట్టుకునే లవ్ స్టోరీ. సో... డోంట్ మిస్ ఇట్. ఎంజాయ్ ది వీకెండ్ విత్ దిస్ లవ్ స్టోరీ.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5