యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల శివ రెండో సినిమా ప్రిన్స్ మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ. కాగా తన మూడో చిత్రానికి హీరో ఎవరు... ఏ హీరో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే చర్చలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. కొరటాల శివ మూడో సినిమా యూనివర్శిల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మించనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడని సమాచారమ్. 'మిర్చి' కంటే ముందే అల్లు అర్జున్ కి కొరటాల శివ ఓ కథ చెప్పాడట. ఆ స్టోరీ లైన్ ని డెవలప్ చేయమని అప్పట్లో అల్లు అర్జున్ చెప్పాడట. ఇటీవల ఈ కథను డెవలప్ చేసి అల్లు అర్జున్ కి చెప్పాడట శివ. కథ నచ్చడంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తను చేస్తున్న చిత్రం పూర్తయిన వెంటనే ఈ సినిమా చేద్దామని శివకు మాటిచ్చాడట అల్లు అర్జున్. ఈ యేడాది చివరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఈలోపే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఫిల్మ్ నగర్ టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.