చిత్రం - గోవిందుడు అందరివాడేలే
నటీనటులు - రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ, ఆదర్శ్, వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం - యువన్ శంకర్ రాజా
కెమెరా - సమీర్ రెడ్డి
ఎడిటింగ్ - నవీన్ నూలి
బ్యానర్ - పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత - బండ్ల గణేష్
దర్శకత్వం - కృష్ణవంశీ
సెన్సార్ సర్టిఫికేట్ - యు/ఎ
నిడివి - 2గంటల 29నిముషాలు
చిత్రపరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఆ ప్రకారం ఆలోచిస్తే.. స్టార్ హీరోలు చేసే ఎనిమిదో సినిమా కచ్చితంగా పరాజయం పాలవుతుంది. కొంతమంది ఈ సెంటిమెంట్ ని అబద్ధం చేశారు. ఎక్కువ శాతం మంది హీరోల ఎనిమిదో చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన 'గోవిందుడు అందరివాడేలే' తనకు ఎనిమిదో సినిమా. కానీ, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ఎనిమిదో సినిమా ఫ్లాప్ అవుతుందనే ఫోబియాని బ్రేక్ చేస్తానని చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక.. కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో దర్శకత్వం వహించిన చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేకపోయినా.. అవి మంచి సినిమాలనిపించుకున్నాయి. ఆ పరంగా ఆలోచిస్తే.. 'గోవిందుడు...' ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఈ చిత్రం వసూళ్లు కురిపించడం ఖాయమనే ఊహను పోస్టర్ లు, టీజర్ లు కలిగించాయి. మరి.. ఈ 'గోవిందుడు...' అందర్నీ ఆకట్టుకుంటాడా?.. కనక వర్షం కురిపిస్తాడా?.. అనే విషయం కాసేపట్లో తెలుసుకుందాం.
కథ
చిన్నప్పట్నుంచి లండన్ లో పుట్టి పెరుగుతాడు రామ్ చరణ్ (అభిరామ్). మన పని మనమే చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కలుపుకుపోవాలి అనే సిద్ధాంతాన్ని నమ్మే కుర్రాడు. లండన్ లో ఉంటున్నప్పటికీ భారతీయ సంస్ర్కతి, ఆచారాలు, పండగలు, కుటుంబ విలువలు, సాంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న కుర్రాడు అభిరామ్. తన తండ్రి ద్వారా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటాడు. తనది చాలా పెద్ద కటుంబం అని, ఆ కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకున్న అభిరామ్ ఇండియాలో ఉంటున్న తన తాతగారి ఉరికి వచ్చేస్తాడు.
తన గ్రామం కోసం ఏదైనా చేయాలనే ఆశయంతో అహర్నిశలు ఆలోచించే బాలరాజు (ప్రకాష్ రాజ్) ఇంట్లోకి అడుగుపెడతాడు అభిరామ్. తను ఆ కుటుంబానికి చెందిన వాడే అనే విషయాన్ని వాళ్లకి తెలియనివ్వడు అభిరామ్. కానీ ఆ కుటుంబంతో బాగా కలిసిపోతాడు. వాళ్లతో కలిసుంటూనే ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని తీర్చేసి ఒక తాటిపై నడిచేలా చేస్తాడు. ఫైనల్ గా బాలరాజుకు అభిరామ్ తన ఇంటి వారసుడనే విషయం తెలుస్తుంది. అప్పుడు బాలరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు, అభిరామ్ తన తండ్రి దగ్గర నుంచి తన కుటుంబం గతం గురించి తెలుసుకున్న విషయం ఏంటీ తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించాడు రామ్ చరణ్. ఇప్పటిదాకా మాస్ లుక్స్ తో, మాస్ రోల్స్ చేసాడు. ఈ సినిమా రామ్ చరణ్ ని కంప్లీట్ గా కొత్తగా ఆవిష్కరించింది. అభిరామ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. మంచి నటన కనబర్చాడు.స్టైలిష్ గా ఉన్నాడు. ఈ సినిమా రామ్ చరణ్ లో దాగి ఉన్న నటుడిని బయటికి చూపించింది. కాజల్ అగర్వాల్ విలేజ్ గర్ల్ గా నటించింది. అందం, అభినయంతో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంది. బంగారి పాత్రలో వంద శాతం ఒదిగిపోయాడు శ్రీకాంత్. ఈ పాత్రకు కొంచెం నెగటివ్ షేడ్ ఉంది. ఆ నెగటివ్ షేడ్ ని చక్కగా ఆవిష్కరించాడు శ్రీకాంత్. మంచి పాత్ర దొరికితే విజృంభిస్తానని ఈ పాత్ర ద్వారా తెలియజేసాడు. కమలినీ ముఖర్జీ తన పాత్ర పరిధిమేరకు నటించింది. శ్రీకాంత్ కి జోడీగా బాగుంది. ప్రకాష్ రాజ్, జయసుధ ఈ సినిమాకి హైలెట్. మొత్తం సినిమా వారి పెర్ ఫామెన్స్ మీద ఆధారపడి ఉంది. ఈ ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సీన్స్ ని పండించారు. ప్రేకులను కంట తడి పెట్టిస్తారు. ప్రకాష్ రాజ్ కి అవార్డు ఖాయం. ఆదర్శ్ బాలకృష్ణ నెగటివ్ రోల్ చేసాడు. ఈ సినిమా తర్వాత అతనికి మంచి అవకాశాలు వస్తాయి. కోటా, వివా వంశీ, రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్ గా...
ఈ స్టోరీ లైన్ 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమాని తలపిస్తుంది. కానీ పూర్తి కథలోకి వెళ్లిన తర్వాత ఆ సినిమా ఛాయలు కనిపించవు. డైరెక్టర్ కృష్ణవంశీకి ఎలాంటి స్టోరీ లైన్ కి అయినా సరే, ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లే ఇవ్వగల నేర్పు ఉంది. అతని గత సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈ సినిమా కూడా మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది. స్టోరీ, డైలాగులు కృష్ణవంశీ సమకూర్చుకున్నవే. 80శాతం స్ర్కిఫ్ట్ కంప్లీట్ చేసుకున్న కృష్ణవంశీకి మిగతా 20శాతం స్ర్కిఫ్ట్ కంప్లీట్ చేయడానికి పరుచూరి బ్రదర్స్ సహాయపడ్డారు. డైలాగ్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. హ్యుమన్ వ్యాల్యూస్, డెప్త్ ఉండేలా డైలాగులు రాసారు కృష్ణవంశీ. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. కృష్ణవంశీ కాంబినేషన్ లో యువన్ చేసిన తొలి సినిమా ఇది. 'నీలిరంగు...', 'గులాబి...' పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా రీ-రికార్డింగ్ చేసారు యువన్. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ చేసారు. సినిమా నిడివి ఎక్కవ అవ్వడంతో, కొన్ని సీన్స్ బోరో ఫీలయ్యేలా చేస్తున్నాయి. వాటిని ఎడిట్ చేస్తే, సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. సమీర్ రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. విజువల్ గా సినిమా చాలా బాగుంది. పల్లె అందాలను తన కెమెరాలో అందంగా బంధించారు సమీర్ రెడ్డి. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇది అవుట్ అండ్ అవుట్ డైరెక్టర్ సినిమా. కృష్ణవంశీ వంద శాతం న్యాయం చేసారు. ఈ సినిమాలో ముందుగా రామ్ చరణ్ తాత పాత్ర కోసం తమిళ నటుడు రాజ్ కిరణ్ ని తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్ర నుంచి రాజ్ కిరణ్ ని తప్పించి ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు. ఇది నిజంగా కృష్ణవంశీ తీసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి హైలెట్ ప్రకాష్ రాజ్. తను లేకపోతే ఈ సినిమా లేదు. ఫ్యామిలీ ఎమెషన్స్, చివరి 30నిముషాల డైలాగ్స్ ప్రేక్షకులను కుర్చీలో అతుక్కుపోయేలా చేస్తాయి. కామెడీ, లవ్ ట్రాక్ కి స్కోప్ లేకపోవడం నిరుత్సాహపరిచే విషయం. ఏదేమైనా దసరా పండగను టార్గెట్ చేసుకుని విడుదలైన ఈ సినిమా, పండగలాంటి సినిమానే. అచ్చు తెలుగు సినిమా ఇది. కృష్ణవంశీ గత సినిమాలు అతని కెరియర్ ని అయోమయంలోకి నెట్టేసాయి. ఈ సినిమా అతనిని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ ఉత్సాహంతో కృష్ణవంశీ మరిన్ని ప్రేక్షకాదరణ సినిమాలు చేస్తారని ఊహించవచ్చు.
నో డౌట్ 'గోవిందుడు...' అందరి ప్రశంసలు పొందుతాడు.