చిత్రం - హైదర్
నటీనటులు: టబు, షాహిద్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, కె.కె. మీనన్, శ్రద్ధాకపూర్ తదితరులు
రచన: బషరత్ పీర్, విశాల్ భరద్వాజ్
సంగీతం: విశాల్ భరద్వాజ్
కెమెరా: పంకజ్ కుమార్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
నిర్మాతలు: విశాల్ భరద్వాజ్, సిద్ధార్ధ్ రాయ్ కపూర్
దర్శకత్వం: విశాల్ భరద్వాజ్
షేక్స్ పియర్ 'హామ్లెట్' ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. మక్బూల్, ఓంకారా చిత్రాలను కూడా షేక్స్ పియర్ రాసిన రచనల ఆధారంగానే విశాల్ భరద్వాజ్ రూపొందించారు. ఆ రెండు చిత్రాలు ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చిన నేపథ్యంలో 'హైదర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి.. ఈ చిత్రం ఆ అంచనాలను చేరుకునే విధంగా ఉందా? ట్రాజెడీ కథలను అద్భుతంగా తెరకెక్కించడంలో ప్రతిభావంతుడైన విశాల్ ఈ చిత్రాన్ని ఏ విధంగా తెరకెక్కించాడు? ఈ 'హైదర్' అందర్నీ ఆకట్టుకుంటాడా? అనే విషయాలను తెలుసుకుందాం..
కథ
1995లో కాశ్మీర్లో 'హైదర్' కథ ఆరంభం అవుతుంది. డా. హిలాల్ మీర్ (నరేంద్ర జా), గజాలా (టబు) కొడుకు. యుద్ధంలో గాయపడిన ఓ వ్యక్తికి తన ఇంట్లో ఆదరణ కల్పించి, చికిత్స చేయిస్తాడు హిలాల్ మీర్. మిలటరీవారికి ఈ విషయం తెలిసి, మీర్ ఇంటిపై దాడికి దిగుతారు. ఈ నేపథ్యంలో మీర్ కనిపించకుండా పోతాడు. హఠాత్తుగా భర్త మాయం కావడంతో గజాలా ఖంగు తింటుంది. ఈ పరిస్థితిని తనకు సాధకంగా వాడుకోవాలనుకుంటాడు మీర్ సోదరుడు కుర్రమ్ (కే ఏ మీనన్). గజలాని తన ట్రాప్ లో పడేసి, పెళ్లి కూడా చేసుకుంటాడు. తల్లి, పెదనాన్న ఇలా చేయడం హైదర్ కి మింగుడుపడదు. తన తండ్రి ఎక్కడో బతికే ఉంటాడన్నది అతని నమ్మకం. తండ్రి జాడ తెలుసుకోవడానికి పూనుకుంటాడు. ప్రేయసి ఆర్షియా (శ్రద్ధా కపూర్) సహాయం తీసుకుంటాడు. ఆర్షియా జర్నలిస్ట్. తండ్రి మాయమైన కొద్ది రోజులకే పెళ్లి చేసుకున్న తల్లి, పెదనాన్నపై పగతో రగిలిపోతాడు హైదర్. తన పగను ఏ విధంగా చల్లార్చుకున్నాడు? తండ్రి జాడ తెలుసుకోగలిగాడా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త మాయమైన తర్వాత బావని గజలా ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటులు పర్ఫార్మెన్స్
నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే అంగీరిస్తున్న టబు.. నెగటివ్ ఛాయలున్న ఈ పాత్రను అద్భుతంగా పోషించింది. కొడుకుగా నటించిన షాహిద్ కపూర్ కి, టబుకి పెద్దగా వయసు వ్యత్యాసం లేదు. అయినప్పటికీ తల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఇక.. షాహిద్ కపూర్ అయితే అత్యద్భుతంగా నటించాడు. తన కెరీర్ లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఆర్షియా పాత్రలో శ్రద్ధాకపూర్ పూర్తిగా ఒదిగిపోయింది. ఇంకా ఇర్ఫాన్ ఖాన్, రూదర్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
సాంకేతిక వర్గం
విశల్ భరద్వాజ్ లో అద్భుతమైన దర్శకుడున్న విషయం ఈ చిత్రం ద్వారా మరోసారి నిరూపితమైంది. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టగలిగాడు. ముఖ్యంగా టబుని చూపించిన విధానం, ఆమె నుంచి నటన రాబట్టిన వైనం సుపర్బ్ అనే చెప్పాలి. భావోద్వేగపూరితమైన సన్నివేశాలకు ప్రేక్షకుడి మనసు కరగడం ఖాయం. శ్రీనగర్ అందాలను పంకజ్ కుమార్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఫొటోగ్రఫీ మెయిన్ ఎస్సెట్. పాటలు కథానుసారం సాగుతాయి. ముఖ్యంగా 'బిస్ మిల్...' పాట బాగుంది. ఇతర శాఖలు మెరుగైన పనితీరుని కనబర్చాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
షేక్స్ పియర్ నవలకు అద్భుతమైన తెరరూపం ఇచ్చారు విశాల్. ఇదొక అర్థవంతమైన చిత్రం. ఎంతటి గొప్ప చిత్రంలో అయినా చిన్న చిన్న లోపాలుంటాయి. ఈ చిత్రం నిడివి ఎక్కువ కావడం ఓ మైనస్. అలాగే, సెకండాఫ్ కొంచెం సాగదీసినట్లుగా ఉంటుంది. సాగతీతను ప్రేక్షకుడు ఫీలవుతున్న తరుణంలో కథ ఊపందుకుంటుంది. కాబట్టి, అది పెద్ద మైనస్ కాదు. ఈ చిత్రం మొత్తాన్ని టబు, షాహిద్ తమ భుజలపై మోశారు. విశాల్ టేకింగ్, ఈ ఇద్దరి నటన సినిమాకి హైలైట్.
ఫైనల్ గా చెప్పాలంటే.. థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రం మనసులను వెంటాడుతుంది. వీక్షకులను ఉద్వేగానికి గురి చేసే మంచి కవితలాంటి సినిమా.