ఆ నలుగురు చేతుల్లో థియేటర్స్ ఉన్నాయి... చిన్న సినిమాలను బ్రతకనివ్వడంలేదు... సరైన థియేటర్స్ ఇవ్వడం లేదు... చిన్న నిర్మాతలు ఈ మాటలు అంటూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. ఇక రిలీజ్ అయిన తమ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని, సరైన థియేటర్స్ ఆ సినిమాకి పడకపోతే సదురు నిర్మాత పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఇవన్ని చిత్ర పరిశ్రమ లోలోపల జరిగే విషయాలు. థియేటర్స్ పై ఆదిపత్య పోరు సాగిస్తున్న కొంతమంది నిర్మాతలు ఆడే గేమ్ లో చాలామంది బలవుతుంటారు. ఈ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టలేక సతమతమయ్యే నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే...
ఈ రోజు (15.8.2018) విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'గీత గోవిందం' చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ వచ్చింది. ఇంత పాజిటివ్ టాక్ ఉన్న ఈ సినిమాకి సిటీలో చాలా వరకూ థియేటర్స్ దొరకలేదనే విషయం నిర్ఘాంతపోయేలా చేస్తోంది. గత వారం విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' కి ఫ్లాప్ టాక్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడటంలేదు. సినిమాని ఆడిస్తున్నారు. 'గీత గోవిందం' ఫస్ట్ షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళుతుంది. కాకపోతే ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకలేదు. హైదరాబాద్ సిటీలో అయితే ఈ సినిమాకి చాలా తక్కువ థియేటర్స్ దొరికాయి.
దిల్ రాజు చేతుల్లో థియేటర్స్ ఉండటంతో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఆడకపోయినా, వేరే సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాని ఆడిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని, హిట్ టాక్ తెచ్చుకున్న 'గీత గోవిందం' లాంటి సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరికితే, మంచి వసూళ్లు తెచ్చిపెడుతుందని ఇది చిత్ర పరిశ్రమకు లాభం చేకూర్చే పని అని కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఫ్లాప్ సినిమాకి థియేటర్స్ కేటాయించడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కూడా అంటున్నారు. 'గీత గోవిందం' స్ర్కీనింగ్ అవుతున్న ప్రతి థియేటర్ కళకళలాడుతోంది. ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అలాంటప్పుడు ఇలాంటి సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా గేమ్స్ ఆడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా నెక్ట్స్ సినిమా విడుదల వరకే వసూళ్లు తెచ్చిపెట్టగలదు. కొత్త సినిమా విడుదలయ్యి, ఆ సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ సినిమా వసూళ్లు తగ్గిపోతాయి. కాబట్టి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా కిల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి ఇకనైనా 'గీత గోవిందం' కి ఎక్కువ థియేటర్స్ ఇచ్చి చిత్ర పరిశ్రమలోని లుకలుకలు బయటపడకుండా జాగ్రత్త పడితే బెటర్... ఏమంటారు...!