గత రెండు రోజుల నుంచి పెద్ద సినిమాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ లో సందడి నెలకొంది. నందమూరి అభిమానులు తమ అభిమాన హీరో బాలయ్య, బోయపాటి సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (31.1.2021) #BB3 రిలీజ్ డేట్ ను మధ్యాహ్నం 3 గంటల 36 నిముషాలకు అధికారికంగా ప్రకటించింది చిత్రం యూనిట్.
మే 28న సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. ఈ డేట్ ని ప్రకటించిన దగ్గర్నుంచి నందమూరి అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ''మే 28 నుంచి సింహగర్జన ఆరంభం'' అంటూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది బాలయ్య, బోయపాటి కాంబినేషన్. ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి #BB3 ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో, ఎన్ని రికార్డులను తిరగరాయనుందో వేచిచూద్దాం.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.