తెలుగు చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకుడు 'దర్శకరత్న' డా. దాసరి నారాయణరావు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి, అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న ఘనత ఆయనది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఇంకా మరెన్నో సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, తన కలల ప్రాజెక్ట్ చేసి, ఆయన దర్శకత్వం మానేయాలనుకుంటున్నారు. నేడు (4.5.2016) డా. దాసరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్య్వూలో ఈ కలల ప్రాజెక్ట్ గురించి చెప్పారు. దాసరి కలల ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందాం.
మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో జరిగిన మంత్రాంగాలు, రాజకీయాలను ఇప్పటివరకూ ఎవరూ తెరకెక్కించలేదు. ఆ యుద్ధం తాలూకు రాజకీయాలను తెరకెక్కించాలన్నది దాసరి ఆకాంక్ష. ఇది భారీ ప్రయత్నం. దీన్ని నాలుగు భాగాలుగా తీయాలనుకుంటున్నారు. నాలుగు భాగాలకూ అయ్యే ఖర్చు '400 కోట్లు'. ఓ ఫారిన్ కంపెనీ కొలాబరేషన్ తో ఈ చిత్రం చేయాలనుకుంటున్నారు.ఈ నాలుగు భాగాలకూ దర్శకత్వం వహించిన తర్వాత ఇక దర్శకునిగా రిటైర్ అవుతానని దాసరి పేర్కొన్నారు. ఘంటశాలకు 'భగవద్గీత' మిగిలినట్లుగా తనకు ఈ నాలుగు భాగాల చిత్రం మిగిలిపోవాలన్నదే కోరిక అని దాసరి వెల్లడించారు. ఈ దర్శక దిగ్గజం కోరిక నెరవేరాలనీ, ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని 'ఫిల్మీబజ్.కామ్' మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.