విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి అనే మాట అతిశయోక్తి కాదు. నటుడిగా ఎన్టీఆర్ సృష్టించిన సంచలనం తెలియనది కాదు. రాముడు, కష్ణుడు, రావణాసురుడు, దుర్యోధనుడు.. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం తెలుగు ప్రజలకు తెలుసు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రప్రంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. ఇక, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. కిలో బియ్యం రెండు రూపాయలకు, ఆస్తిలో ఆడపడుచులకు సగం వాటా... ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ జనాలకు బాగా ఉపయోగపడ్డాయి. తను అనుకున్న పథకాలను విజయవంతంగా సాగేలా చేసిన ఘనత ఆయనది.
భౌతికంగా ఎన్టీఆర్ దూరమై 19 ఏళ్లు అయినప్పటికీ ఇంకా అందరి మనసుల్లోనూ కొలువై ఉన్నారు. ఆయన జీవిత చర్రిత భవిష్యత్ తరాలకు తెలియాలనే సదాశయంతో పాఠశాల పుస్తకాల్లో పాఠ్యాంశంగా పెట్టారు. టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ లో ఎన్టీఆర్ పాఠ్యాంశం ఉంటుంది. ముందు సినీ కళాకారుడిగా రాణించి, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకున్న ఎన్టీఆర్ కి దక్కాల్సిన గౌరవమే దక్కింది. భవిష్యత్తులో ఈ అరుదైన గౌరవం ఏ సినీ కళాకారుడికీ, రాజకీయ నాయకుడికీ దక్కక పోవచ్చు. దటీజ్ ఎన్టీఆర్. ఈ రోజు (18.1.2016) ఎన్టీఆర్ వర్ధంతి. భౌతికంగా మాత్రమే ఆయన దూరమయ్యారు... తెలుగు ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.