చిత్రం - బేబీ
నటీనటులు - ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, కుసుమ, లిరిష, సాత్విక్ ఆనంద్, సీత, కీర్తన, బబ్లూ తదితరులు
మ్యూజిక్ - విజయ్ బుల్గానిస్
సినిమాటోగ్రఫీ - ఎం.ఎస్.బాల్ రెడ్డి
నిర్మాతలు - ఎస్.కె.ఎన్
డైరెక్టర్ - సాయి రాజేష్ నీలం
ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (14.7.2023) థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
ఆటో డ్రైవర్ అయిన ఆనంద్(ఆనంద్ దేవరకొండ) తన ఎదురు ఇంట్లో ఉండే వైష్ణవి (వైష్ణవి చైతన్య) ని గాఢంగా ప్రేమిస్తాడు. వైష్ణవి కూడా టెన్త్ క్లాస్ నుంచే ఆనంద్ ని ప్రేమిస్తుంది. కానీ ఇంజనీరింగ్ లో చేరిన వైష్ణవికి కాలేజ్ లో విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు...ఆనంద్, వైష్ణవి, విరాజ్ మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీలో గెలుపెవరిది... గాఢంగా వైష్ణవిని ప్రేమించిన ఆనంద్ చివరకు తన ప్రేమను గెలుచుకుంటాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఆనంద్ దేవరకొండ ప్రేమికుడిగా, గుండె బద్దలైన ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు. ఆనంద్ పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు. లవ్, ఎమోషన్ సీన్స్ లో తనదైన శైలిలో నటించి మెప్పించాడు. హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కూడా చాలా బాగా నటించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో వైష్ణవి నటనకు ఆడియన్స్ పిధా అయిపోతారు. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించాడు. తండ్రి పాత్రలో నాగబాబు, ఇతర కీలక పాత్రలు పోషించిన వైవా హర్ష, లిరిష, కుసుమ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం
డైరెక్టర్ సాయి రాజేష్ యూత్ ని టార్గెట్ చేస్తూ రాసుకున్న కథ ఇది. ప్రేమ, ప్రేమలోని ఎమోషన్స్, పెయిన్స్ ని చక్కగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ ఫుల్ గా సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిస్ చక్కటి పాటలు అందించారు. ముఖ్యంగా ఇలాంటి లవ్ స్టోరీలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే ఎమోషన్స్ ఆడియన్స్ కు రీచ్ అవుతాయి. ఆ పరంగా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని లెంగ్త్ తగ్గించి ఉంటే... సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉండేది. నిర్మాత ఎస్.కె.ఎన్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
'బేబీ' టైటిల్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ సినిమాకి పాజిటివ్ వైబ్స్ తెచ్చి పెట్టాయి. ఇక థియేటర్ లో సినిమా చూసే ఆడియన్స్ ని మెప్పించడానికి కథ... కథలోని ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. డీసెంట్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమలో పడిన యువత ... వారు చేసే తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే విషయాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. హీరోయిన్, హీరోయిన్ మధ్య సాగే కొన్ని సన్నివేశాలు ఇప్పటి యువతను రిఫర్ చేసినట్టు ఉంటాయి. సూటిగా వారి గుండెలకు తాకుతాయి. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
ఓవరాల్ గా చెప్పాలంటే... 'బేబీ' డీసెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ. సో... డోంట్ మిస్ ఇట్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5