చిత్రం - రావే నా చెలియా
నటీనటులు - నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్, సీనియర్ నటి కవిత, కారుమంచి రఘు, రచ్చ రవి తదితరులు
డైలాగ్స్ - మల్లేశ్వర్ బుగ్గ
కెమెరా - విజయ్ ఠాగూర్
సంగీతం - ఎమ్ ఎమ్ కుమార్
ఎడిటింగ్ - రవి మన్ల
నిర్మాత - నెమలి అనిల్
కథ, దర్శకత్వం - మహేశ్వర రెడ్డి
విడుదల తేదీ - ఆగస్ట్ 13, 2021
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్స్ తెరుచుకున్నాయి. రెండు వారాలుగా సినిమాలు విడుదలవుతున్నాయి. దాంతో శుక్రవారం కోసం ఆడియన్స్ ఎదురుచూపులు మొదలయ్యాయి. ఈ శుక్రవారం మూడు, నాలుగు సినిమాలు థియేటర్స్ కి వచ్చాయి. అందులో 'రావే నా చెలియా' ఒకటి. నెమలి అనిల్, సుభాంగిపంత్, విరాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మహేశ్వర రెడ్డి దర్శకత్వంలో నెమలి అనిల్ నిర్మించారు. టైటిల్ ని బట్టి ఈ సినిమా లవ్ ఎంటర్ టైనర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ లవ్ స్టోరీ ఎలా ఉంది... ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
వరుసగా ఫ్యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న గగన్ (నెమలి అనిల్) పరాజయాలను చవిచూడాల్సి వస్తుంది. దాంతో రూటుమార్చి లవ్ స్టోరీతో సినిమా చేయాలి, లేకపోతే వేరే డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తానని నిర్మాత చెప్పడంతో గగన్ మంచి ప్రేమకథా చిత్రం చేయాలనే టార్గెట్ తో కథ రెడీ చేసుకోవడానికి వైజాగ్ బయలుదేరతాడు. దారిలో రాజీ (సుభాంగి పంత్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు ఓ లవ్ స్టోరీ ఉందని తెలుసుకుని, ఆ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి సమాయత్తమవుతాడు. రాజీనే ఆ లవ్ ఎంటర్ టైనర్ కి హీరోయిన్ గా తీసుకుంటాడు గగన్. పెళ్లి వరకూ వెళ్లిన రాజీ, విరాజ్ ( సాగర్) ల ప్రేమకథ ఎందుకు బ్రేకప్ అవుతుంది. సినిమా తెరకెక్కించే క్రమంలో గగన్, రాజీ ఎంత దగ్గరయ్యారు ... చివరికి సాగర్ కి రాజీ దగ్గరవుతుందా లేక గగన్ కి దగ్గరవుతుందా అనేదే ఈ చిత్ర కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
హీరో అనిల్ కి ఇది ఫస్ట్ మూవీ. అయినప్పటికీ చాలా సెటిల్డ్ గా నటించి ఆడియన్స్ మనసులను దోచుకున్నాడు. నటనపరంగా ప్లస్ మార్కులు వేయించుకున్న అనిల్, శరీరాకృతిపై దృష్టి పెడితే బాగుంటుంది. హీరోగా కొనసాగాలంటే మేకోవర్ అవ్వడం అవసరం. డ్యాన్స్, ఫైట్స్, డైలాగులు పలికిన విధానం సూపర్బ్. హీరోయిన్ గా నటించిన సుభాంగిపంత్ కి మంచి మార్కులు పడతాయి. క్యూట్ గా ఉంది. సెకండ్ హీరోగా నటించిన విరాజ్ కూడా కొన్ని సన్నివేశాల్లో చక్కటి నటనను కనబర్చాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ హైలైట్. పల్లెటూరు అందాలను తన కెమెరాలో చక్కగా బంధించారు కెమెరామ్యాన్ విజయ్. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్.కుమార్ చక్కటి పాటలిచ్చారు. వినడానికి పాటలు చాలా బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండటం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. బోర్ కొట్టకుండా సినిమాని నడిపించడంలో డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు. సుత్తి లేకుండా కథను సూటిగా చెప్పడంతో ఆడియన్స్ కి ఎక్కడా విసుగు అనిపించదు. కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కంచడానికి బడ్జెట్ సమకూర్చడంలో నిర్మాత అనిల్ వెనుకాడలేదు. విజువల్ గా చాలా రిచ్ గా ఉంటుంది సినిమా.
విశ్లేషణ
ఓ యాక్సిడెంట్ తో సినిమా ఆరంభమవుతుంది. ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యిందని తెరపై చూపించిన విధానం సూపర్బ్. 'ఇష్టం వేరు - ప్రేమ వేరు' అనే మెసేజ్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేసారు డైరెక్టర్. లవ్ స్టోరీ అయినప్పటికీ, హద్దులు దాటకుండా... క్లీన్ ఎంటర్ టైనర్ గా సినిమాని తెరకెక్కించారు. దాంతో యూత్ కే కాదు... అన్ని వర్గాల ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఒకరితో ప్రేమలో పడి పెళ్లివరకూ వెళ్లిన హీరోయిన్, మళ్లీ మరొకరితో ప్రేమలో పడటం వంటి సీన్స్ ని ఇంకాస్త కన్వీన్సింగ్ గా చెప్పి ఉంటే బాగుండేది. క్లయిమ్యాక్స్ బాగుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇష్టం వేరు - ప్రేమ వేరు అనే చక్కటి మెసేజ్ కూడా ఉంది. క్లీన్ ఎంటర్ టైనర్ కాబట్టి, కుటుంబంతో కలిసి సినిమాని చూడొచ్చు. సో... ఈ వీకెండ్ ని 'రావే నా చెలియా' తో ఎంజాయ్ చెయ్యొచ్చు. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ మిస్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5